ఉద్యోగం చేస్తూ పార్ట్ టైమ్ బిజినెస్‌గా, లేదా ఫుల్ టైమ్ స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలంటే.. అందుకు షాపులు పెట్టి.. భారీగా పెట్టుబడి పెట్టి.. వ్యాపారం చేయాల్సిన పనిలేదు. చాలా తక్కువ వ్యయంతోనే ఇండ్లలోనే స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతో అధికంగా డబ్బు సంపాదించవచ్చు. అయితే అలా ఆదాయాన్నిచ్చే వ్యాపారాల్లో.. మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ కూడా ఒకటి. దీనికి చాలా తక్కువ పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ.వేలల్లో సంపాదించుకోవచ్చు. మరి ఇందుకు ఎంత వరకు వ్యయం అవుతుందో.. ఏ మేర లాభాలు పొందవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ పెట్టేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. మాప్ స్టిక్‌లను తయారు చేసే మెషిన్ ఖరీదు రూ.4వేల వరకు ఉంటుంది. ఇక ముడిసరుకులో మాప్ యార్న్ ఖరీదు కేజీకి రూ.35 వరకు ఉంటుంది. అలాగే మాప్ క్లిప్స్ ఒకటి రూ.9, మాప్ స్టిక్ ఒక్కటి రూ.12 వరకు ఉంటుంది. ఈ క్రమంలో మాప్ యార్న్‌ను ఒక త్రెడ్‌తో కట్టి దాన్ని పిన్ సహాయంతో క్లిప్‌కు అమర్చాలి. అనంతరం స్టిక్‌ను అందులో మెషిన్ సహాయంతో ఫిక్స్ చేయాలి. ఈ క్రమంలో మాప్ స్టిక్ తయారు చేయవచ్చు.
ఇక ఒక్క మాప్ స్టిక్‌ను తయారు చేసేందుకు మనకు దాదాపుగా రూ.30 వరకు ఖర్చవుతుంది. హోల్‌సేల్ మార్కెట్‌లో దీన్ని రూ.50 వరకు అమ్మవచ్చు. రిటెయిల్‌లో అయితే రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయించవచ్చు. ఈ క్రమంలో మనకు రూ.20 నుంచి రూ.50 వరకు ఒక్క స్టిక్‌పై ఆదాయం వస్తుంది. అయితే మార్కెటింగ్ బాగా చేయగలిగితే.. మాప్ స్టిక్‌లను చాలా సులభంగా అమ్మవచ్చు. ఈ క్రమంలో అన్ని స్టిక్‌లను హోల్ సేల్ ధరలకు అమ్ముకుంటే.. ఆ మేర లాభాలను ఆర్జించవచ్చు.
ఇక ఈ బిజినెస్‌లో నిత్యం 200 వరకు మాప్ స్టిక్‌లను తయారు చేసేందుకు వీలుంటుంది. దీంతో ఒక్కో స్టిక్‌పై ఎంత లేదన్నా రూ.20 లాభం వేసుకున్నా.. నిత్యం రూ.4వేలను.. నెలకు రూ.1.20 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. అయితే అంత పెద్ద మొత్తంలో ఆదాయం రావాలంటే.. స్టిక్‌లను బాగా అమ్మాల్సి ఉంటుంది. అందుకు అవసరం అయితే మార్కెటింగ్ చేయాలి. ప్రస్తుతం మార్కెట్‌లో క్లీనింగ్ పరికరాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కనుక.. ఈ మాప్ స్టిక్ తయారీ బిజినెస్ పెడితే.. ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది..!