ఏపీలో రానున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కోసం బీజేపీ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది. ఉప ఎన్నికల్లో ఉన్న పళంగా ముందు వరుసలోకి రావడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే మీటింగ్లు, మండలానికో నేతకు బాద్యతులు అంటూ పని మొదలు పెట్టేశారు. ఇదిలా ఉండగానే సర్జికల్ స్ట్రైక్ అంటూ ఎంపి జీవీఎల్ పొలిటికల్ హీట్ పుట్టించారు. తెలంగాణలో వర్కవుట్ అయిన అస్త్రాన్ని ఏపీలోనూ ప్రయోగించాలని చూశారు. ఏకంగా ఒకటి కాదు రెండు సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని గప్పాలు కొట్టారు.కానీ ఎంపీ గారి సర్జికల్ స్ట్రైక్స్ మీద సొంత పార్టీలోనే సెటైర్లు ఎక్కువయ్యాయట..
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్ వాడిన సర్జికల్ స్ట్రైక్ పద ప్రయోగం పెద్ద దూమారాన్నే లేపింది. ఒక్క సారిగా ప్రచారంలో వేడి తీసుకు వచ్చింది. ఇతర పార్టీలు సైతం అదే ట్రాప్ లో పడేలా చెయ్యగలిగింది. దీంతో ఎన్నికల ప్రచారంలో అంతా బీజేపీ కామెంట్ల చుట్టూనే కథ నడిచింది. ఫలితం కూడా ఆశించిన విధంగానే వచ్చింది. దీంతో ఏపీలో జరిగే తిరుపతి బైపోల్స్ లో కూడా అదే అస్త్రన్ని తెరపైకి తెచ్చారు కమలనాథులు. టెంపుల్ టౌన్ లో సమావేశాలు పెట్టి మరీ…..ఈ తరహా కామెంట్లు చేశారు. ఎంపీ జీవీఎల్ మరో అడుగు ముందుకేసి తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఏపీలో రెండు చేస్తామంటూ హిందు సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశాడు.
అయితే తెలంగాణలో ఊపు తెచ్చిన ఆ సంచలన వ్యాఖ్య…ఏపీలో మాత్రం తుస్సు మంది. రెండు పార్టీల పై రెండు సర్జికల్ స్ట్రైక్ లు అంటూ జీవీఎల్ చేసిన కామెంట్ పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. తామే అసలు లౌకిక వాదులం అని..వైసీపీ, టిడిపి మత తత్వ పార్టీలు అని జీవీఎల్ చెప్పుకోచ్చారు. తెలంగాణ ఎంపి కామెంట్ ను కాపీ కొట్టి చేసిన పద ప్రయోగం మాత్రం ఇక్కడ పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే జీవీఎల్ కామెంట్స్ పార్టీ కేడర్ లో అటెన్షన్ తీసుకురాకపోగా సొంత పార్టీ నుంచే సెటైర్లు స్టార్టయ్యాయి.
ఉప పోరులో సంచలన కామెంట్లు, పెద్ద పెద్ద హామీల కంటే…వాస్తవాలకు దగ్గరగా ప్రయాణం మంచిదని పార్టీ లోని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు.ఏపీ రాజకీయాలకు నప్పని అంశాలను జొప్పించడం వల్ల అటెన్షన్ రాకపోగా….అబాసుపాలవుతాం అని నేతలు గుసగుసలాడుతున్నారు. కొత్త రాజకీయ పరిణామాలకు ఉపపోరు వేదిక కావాలన్న దిశగా వ్యూహాలు పన్నుతున్న బీజేపీ.. రానున్న రోజుల్లో ఇంకా ఏఏ అంశాలు తెరపైకి తెస్తుందో చూడాలి.