ప్రతి మండలంలో రెండు గ్రూపులు.. నిత్యం తగాదాలు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారట సొంత కేడర్. ఈ గ్రూపు తగదాలు సెట్ చేసే లోపే పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని కేడరే ఎమ్మెల్యేసై సెటర్లు వేస్తోందట. అధికార టిఆర్ఎస్ లో తారాస్థాయికి చేరిన విభేదాలు కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన సుంకె రవిశంకర్ కి తలబొప్పి కట్టిసున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని గత ఎన్నికల్లో చొప్పదండిలో కొత్తవారికి చాన్సిచ్చారు సీఎం కేసీఆర్. అలా టిక్కెట్ దక్కించుకుని ఫస్ట్ చాన్సులోనే బంపర్ మెజార్టీతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయ్యారు సుంకే
రవిశంకర్. పార్టీ బలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని భావించినంత సేపు పట్టలేదు అక్కడి వర్గ విభేదాలు బయటపడటానికి..నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. రోజూ అసమ్మతి స్వరాలు ఆరున్నొక్క రాగంలో వినిపిస్తున్నాయట. ఒకప్పుడు ఎమ్మెల్యే రవిశంకర్‌కు బాసటగా నిలిచిన వారే ఎదురు తిరుగుతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యే రవిశంకర్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్నది ఆయన్ని వ్యతిరేక వర్గం ఆరోపణ. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారిని కాదని.. ఇతరులకు పార్టీ పదవులు.. నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. దాంతో మున్సిపల్ ఎన్నికల్లోనే ఎమ్మెల్యేకు పోటీగా మరో ప్యానెల్‌ను నిలబెట్టి కోఆప్షన్ ఎన్నికల్లో సత్తాచాటారు పార్టీ నేతలు. ఇక్కడి ఆధిపత్య పోరు కారణంగా అధికారపార్టీ అభ్యర్థి ఓడిపోవడం టీఆర్‌ఎస్‌లో పెద్ద చర్చే జరిగిందట. అప్పటి నుంచి హైకమాండ్ చొప్పదండిపై ఫోకస్ పెట్టినా పార్టీ గాడిలో పడే పరిస్థితి లేదంటున్నారు.
ఇటీవల జరిగిన మార్కెట్ కమిటీ నియామకంలోనూ టీఆర్‌ఎస్‌లో స్థానికంగా మరిన్ని చీలకలు తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అదే పనిగా విమర్శలు చేస్తున్నారట. దీంతో ఈ నియోజకవర్గంలో విపక్షానికి పెద్దగా పని లేకుండా పోయిందని టాక్. చివరకు ఎమ్మెల్యే రవిశంకర్ చేపట్టిన సేవా కార్యక్రమాలపైనా వ్యతిరేకవర్గం కన్ను పడిందట. కేవలం వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేందుకే పార్టీ కార్యక్రమాలు కాకుండా సేవల పేరుతో జనాల్లోకి వెళ్తున్నారని ఆయన వ్యతిరేక శిబిరం విరుచుకుపడుతోంది.
ఇటీవల రైతుల ఆందోళనకు మద్దతుగా టీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపిస్తే.. చొప్పదండిలోని ఒకటి రెండు మండలాల్లోనే కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యేపై కినుక వహించే ఎవరూ రాలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో రవిశంకర్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చెప్పలేని విధంగా పోస్టులు పెడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై పోలీస్‌లకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని ఫిర్యాదులను పోలీసులు తీసుకోలేదని చెవులు కొరుక్కుంటున్నారు.
ప్రస్తుతం చొప్పదండిలో ప్రతిపక్ష పార్టీల నేతలే నియోజకవర్గంలో హవా చూపించుకుని తిరుగుతున్నారట. ఆ పాటి గుర్తింపు గౌరవం తమకు లేదని వాపోతున్నారట అధికార పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకోవాలని కూడా చూస్తున్నట్టు సమాచారం. మరి ముదిరి పాకాన పడుతున్న ఈ సమస్యను టీఆర్‌ఎస్ పెద్దలు ఎలా కొలిక్కి తెస్తారో చూడాలి.