సొంత పార్టీ నేతలే టార్గెట్.. కేశినేని వ్యూహం వేరే ఉందా ?

-

బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి సడన్ గా ఎందుకు రూటు మార్చారు
రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళలో టెంపర్ మీద ఉండే నాని ఆ తర్వాత తన తత్వం మార్చుకున్నారు. విబేధాలకు దూరంగా అందరితో కలివిడిగానే ముందుకెళ్ళారు. అయితే మళ్ళీ నాని అటు సొంత పార్టీ వాళ్ళతో, ప్రతిపక్ష పార్టీ నేతలతో కయ్యానికి కాలు దువ్వుతూ పాత నానిని గుర్తు చేస్తున్నారు. కేశినేని టెంపర్ తో ప్రతిపక్ష పార్టీకే కాదు సొంత పార్టీ కూడా బెజవాడలో ఇరుకునపడిన పరిస్థితి వచ్చింది. సొంత పార్టీ నేతలే టార్గెట్ గా కేశినేని నాని కామెంట్స్ చేస్తుండటంతో నాని వ్యూహం పై ఇంటా బయటా చర్చ నడుస్తుంది.

కేశినేని నాని 2009 ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా పోటీ చేయటానికి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత చిరంజీవి మీద, ఆ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కేశినేని నాని బెజవాడ ఎంపీగా గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా మంత్రి దేవినేని ఉమాతో పొసగక ఆయనపై బహిరంగ వేదికపై విమర్శలు చేసిన నాని రచ్చకెక్కారు. ఆ తర్వాత రవాణా శాఖ కమిషనర్ వాహనాన్ని అడ్డుకుని వాగ్వివాదానికి దిగి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. అప్పట్లో చంద్రబాబు నాని విషయంలో కలగజేసుకుని బాలసుబ్రహ్మణ్యంకి ఎంపీ నానితో సారీ చెప్పించారు. దీంతో అలిగిన నాని తన కేశినేని ట్రావెల్స్ బస్సులన్నింటిని అమ్మేసి వ్యాపారం చేయనన్నారు. అయితే రాష్ట్రంలో అక్రమ పర్మిట్లతో తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి లేఖలు రాసి రచ్చచేశారు.

ఈ వ్యవహారాల తర్వాత కొంత మెత్తబడిన నాని తన తత్వం మార్చుకుని ఇంతకు ముందుమాదిరిగా దూకుడుగా వెళ్ళటం, పార్టీని ఇబ్బంది పెట్టే పనులను తగ్గించేసి తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు. ఇక 2019 ఎన్నికల తర్వాత నాని తీరులో మళ్ళీ మార్పు మొదలైంది. పార్టీ ఓటమి పాలైనా, తన పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడుగురు పార్టీ ఎమ్మెల్యేలలో ఆరుగురు ఓడినా తాను గెలవటంతో నానిలో మళ్ళీ దూకుడు మొదలైంది. ఈ నేపధ్యంలో కొన్నాళ్ళపాటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లడటం, చంద్రబాబుతో కూడా కయ్యానికి కాలు దువ్వటం మొదలెట్టారు నాని. నాని తీరును గమనించిన పార్టీ అధిష్టానం కూడా ఆయనకు పార్టీలో ఏ పదవి ఇవ్వకుండా జాగ్రత్త పడింది. అయినప్పటికీ నానిలో టెంపర్ మాత్రం తగ్గలేదు.

రెండో సారి గెలిచిన తర్వాత పార్టీ బెజవాడ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ట్విట్టర్ వార్ కు దిగి తీవ్రంగా ఇద్దరు నేతలు ఒకరి పరువు మరోకరు తీసుకున్నారు. దీనిపై కూడా అధిష్టానం నానికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు నాని తన టెంపర్ చూపిస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. బెజవాడ మేయర్ అభ్యర్థిగా తన కుమార్తె శ్వేతను బరిలోకి దింపిన నాని అందరితో కలుపుగోలుగా ఉండాల్సింది పోయి అందరితో సున్నం పెట్టుకుని తన పాత పంథాలోకి వెళ్ళటంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాను మాత్రమే గెలిచానని మిగతా వారంతా ఓడిన వాళ్ళని వారికి నేను చెప్పి రావాలా అంటూ తన పార్టీ నేతలనే నాని అవమానకరంగా మాట్లాడటం, దీనిపై పార్టీ అధినేత స్పందించాలి కదా అంటూ మళ్ళీ చంద్రబాబుని సైతం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నాని.

ఇక ఎవరు సహకరించకపోయినా కార్పొరేషన్ గెలుస్తామని చెబుతున్న నానికి బెజవాడ పార్టీలో కీలక నేతలు ఎవరూ సహకరించేలా లేరు. ఇక అధికార పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ పై కూడా ఘాటు విమర్శలు ఆరోపణలు చేస్తూ నాని తన పాత స్వభావాన్ని బయటకు తీయటంపై అటు సొంత పార్టీలో ఇటు అధికార పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఇలా సొంత పార్టీ నేతలను ఏకిపారేస్తునే అధికారపార్టీ నేతలతో కయ్యానికి దిగడంతో ఎంపీ కేశినేని ప్యూహం ఏమై వుంటుందా అన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news