సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 17న తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించనున్న సోనియా గాంధీ సభతో కేసీఆర్ పతనం ప్రారంభమవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజా దర్బార్ నిర్వహించని వ్యక్తి కేసీఆర్ ఒక్కడే అని మండిపడ్డారు. కేసీఆర్ అధికారకాంక్షతో రాష్ట్ర ఖజానా దుర్వినియోగం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70-80 సీట్లు గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ గెలుపు.. యావత్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల గెలుపు అని అన్నారు.
“మీ పార్టీ నుంచి తెలంగాణ ద్రోహులను తీసేయండి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతం మాత్రమే. కేసీఆర్ 115 మందిని ప్రకటించి ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చి పంపారు. కేటీఆర్ రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి. మేం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. చంద్రబాబు మంత్రి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టాడు. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మేం తెలంగాణ కోసం కొట్లాడినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్ వినాలి. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారు. సోనియా పాత్ర లేదని కేటీఆర్ అంటున్నాడు. పిల్లల మరణాలకు చలించి సోనియా తెలంగాణ ఇచ్చింది. సోనియా పై కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కేటీఆర్ కి తగదు” అని కోమటిరెడ్డి హితవు పలికారు.