ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరుగుతోందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. జగన్.. బీసీల జీవితాల్లో వెలుగులు తెచ్చే లాంటి పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు కూడా తమ కోసం ఇన్ని పనులు చేయలేదని చెప్పారు.
బీసీల కోసం 56 కార్పొరేషన్లు తీసుకొచ్చి అందరికీ గుర్తింపు ఇచ్చారని కృష్ణయ్య జగన్ ను కొనియాడారు. జగన్.. బీసీల కోసం చేస్తున్న కార్యక్రమాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. జగన్ మాత్రమే పార్లమెంటులో బీసీల బిల్లు పెట్టించారని గుర్తు చేశారు. బీసీలపై సీఎం జగన్‌కి ఉన్న నిజమైన చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆర్.కృష్ణయ్య అన్నారు.
వైసీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో వెనకబడిన తరగతుల (బీసీ) వర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య ఇతర నేతలు హాజరయ్యారు.