పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. మహిళా బిల్లును పాస్ చేయించిన ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. నవ భారత నిర్మాణం కోసం మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో మహిళల బిల్లు కోసం అనేక ప్రయత్నాలు చేశారు, కానీ బిల్లు మాత్రం పాస్ కాలేదన్నారు. మహిళలకు చట్ట సభల్లో చోటు కల్పించాలని కోరుకున్నది బీజేపీ పార్టీనే అని తెలిపారు. మహిళ బిల్లు కోసం ఓటు వేసినందుకు తన జీవితం ధన్యం అయిందన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు ఎంపీ లక్ష్మణ్.
రాహుల్ గాంధీ ఓబీసీ పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఓబీసీ పేరుతో మహిళ బిల్లును రాహుల్ గాంధీ అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జనాభా గణాంకాలు పూర్తైన వెంటనే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అందరూ మోదీకి అండగా ఉండాలన్నారు. మూడో సారి మోదీని గెలిపించాలని కోరారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ గ్యారంటీలు.. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ మాదిరే ఉన్నాయి. తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి. ఆదాయ వనరులు ఎక్కడి నుంచి తెచ్చి ఈ ఉచితాలు పంచుతారో స్పష్టత ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.