ఆయన అధికార పార్టీ ఎంపీ. అయినా ఆ జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదట. ఏం చెప్పినా చేయడం లేదట. పైగా సదరు ఎంపీ పెట్టే సమావేశాలను సైతం లైట్ తీసుకుంటున్నారట.ఖమ్మం జిల్లాలో రాజకీయాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎప్పుడు ఎవరి హవా నడుస్తుందో.. ఎవరెప్పుడు తెరమీదకు వచ్చి పెత్తనం చెలాయిస్తారో చెప్పడం కష్టం. అధికార పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్నా.. కొందరికి ఏదీ కలిసి రాదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. అధికారులను ఆయన్ని పట్టించుకోవడం లేదని జిల్లాలో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.
ఎంపీ నామాకు సహకరించవద్దని ఆదేశాలు ఉన్నాయో ఏమో కానీ అధికారులు మాత్రం చాలా దూరం పాటిస్తున్నారట. కొన్ని సందర్భాలలో ఎంపీ ఫోన్ చేసినా ఆన్సర్ చేయరని టాక్. ఆయన టీఆర్‌ఎస్ ఎంపీనే కాదు… లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత కూడా. అయినా రచ్చ గెలుస్తున్న ఆయన ఇంట గెలవలేకపోతున్నారట. ఇందుకు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరణగా చెబుతున్నారు పార్టీ నాయకులు.
కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరుపై ఎంపీ నామా నాగేశ్వరరావు సమావేశం పెడితే అధికారులు స్పందించలేదు. తనపట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట నామా. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లినట్టు సమాచారం. తన సేవలు ఉపయోగించుకోవాలని.. అందరికీ సహకరిస్తానని ఎంపీ చెప్పినా కొందరు తీరు మారడం లేదని గుసగుసలాడుకుంటున్నారు. జిల్లాలో ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే.. ఆ వేదికలపై ఎంపీ పేరు పలకడానికి కూడా కొందరు అధికారులు ఇష్టపడటం లేదని నామాకు తెలిసిందట. మరికొందరైతే ఎంపీ పిలిచిన మీటింగ్స్‌కు డుమ్మా కొడుతున్నారట.
ఎవరో కావాలని అధికారులను ప్రభావితం చేస్తున్నారని.. అందుకే వారు తన మాట వినడం లేదన్న అభిప్రాయానికి వచ్చారట ఎంపీ నామా. ప్రస్తుతం ఈ అంశంపై ఆయన మనస్తాపం చెందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.