వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఘోర అవమానం ఎదురైంది. లోక్‌సభలోఆయన కూర్చునే సీటును మార్చేయాలంటూ.. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డి స్పీకర్ ఓం బిర్లాకు సిఫారసు చేయడంతోతాజాగా రఘు కూర్చునే సీటును బాగా వెనక్కి మారుస్తూ.. స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం.. రఘురామ సీటు లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీలకు చాలా చివరి వరుసకు చేరిపోయింది. ఇప్పటి వరకు 379వ సీటులో రఘురామకు చోటు ఇచ్చారు. అయితే, ఇటీవల ఆయన వ్యవహార శైలితో వైఎస్సార్ సీపీకి తలనొప్పులు ఎదురయ్యాయి.
స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయి.. అధికార పార్టీపై ఆయన చిందులు తొక్కడం ప్రారంభించారు. తాను పార్టీ లైన్ ఏమాత్రం దాటడం లేదంటూనే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బీజేపీ నేతలతో వరుస భేటీలు అవుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను పందులతో పోల్చారు. తనను తాను హీరోగా అభివర్ణించుకున్నారు. పార్టీ గుర్తింపునే ప్రశ్నార్థకం చేసేలా వ్యవహరించారు. ఇలా వరుస వివాదాలతో చెలరేగిపోయిన ఎంపీగారికి ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాలని భావించిన వైఎస్సార్ సీపీ ఏకంగా ఆయనను ఎంపీగా అనర్హుడని ప్రకటించాలంటూ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఇది పరిశీలనలో ఉంది.
అయినప్పటికీ.. ఎంపీ రఘు.. ఏమాత్రం వెనక్కితగ్గకపోగా.. తనను తాను మరింత వివాదంలోకి నెట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు రఘుతో మేం కలిసి కూర్చోం అని ఎంపీలు చెప్పుకొచ్చారు. దీంతో పార్టీ సీరియస్ నిర్ణయం తీసుకుని రఘును వెలివేసినంత పనిచేసింది. లోక్‌సభలో ఆయన కూర్చునే స్థానాన్ని అంటే 379వ సీటును ఏకంగా 445కు మార్చారు. ఇప్పటి వరకు ఈ సీటులో బెల్లాన చంద్రశేఖర్ కూర్చుంటున్నారు.