ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్, ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. దీంతో రేపే యధావిధిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగినా, కౌంటింగ్ ఫలితాలు ప్రకటించవద్దు అని హైకోర్టు పేర్కొంది. 15వ తేదీన కోర్టు తీర్పు వస్తుందని అప్పుడు ఎన్నికల కౌంటింగ్ గురించి క్లారిటీ రావచ్చని చెబుతున్నారు.
ఎస్‌ఈసీ తరపున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వర్ల రామయ్య టీడీపీ తరఫున పిటిషన్ వేయలేదని, కనీసం ఆయన అభ్యర్ది కూడా కాదని, వ్యక్తిగతంగా రిట్ పిటిషన్ వేయకూడదని సీవీ మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సరైన పేపర్లతో మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముందుకు రావాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి వాదనలు విన్న ధర్మాసనం మధ్యాహ్నం రెండున్నరకు తీర్పు వెల్లడించనున్నట్లు రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఈ తీర్పు వెల్లడించింది.