సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు మహేంద్ర సింగ్ ధోని విధ్వంసకర ఇన్నింగ్స్ తో శ్రీలంక టీమ్ కొట్టుకుపోయింది. 2005 లో శ్రీలంకతో ఇండియా 7 వన్ డేల సిరీస్ ను ఆడింది. ఈ సిరీస్ లో మూడో మ్యాచ్ లో ధోని తన మాస్టర్ స్ట్రోక్ ను చూపించాడు. సిక్సులతో, ఫోర్లతో శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. మ్యాచ్ చివరి వరకు క్రీజ్లో ఉండి గెలిపించాడు. అక్టోబర్ 31,2005 జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. శ్రీలంక విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ధోని ఇన్నింగ్స్ కారణంగా ఆడుతూ పాడుతూ చేధించింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 183 పరుగులు చేశాడు. దీంతో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో మొదటి ఓవర్ లోనే ఓపెనర్ సచిన్ టెండూల్కర్ వికెట్ ను కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. కానీ మూడో స్థానంలో వచ్చిన ధోని తరువాత మ్యాచ్ స్వరూపానే మార్చాడు. చివరి వరకు క్రీజులో ఉండి గెలుపును సులభతరం చేశాడు.