పుష్కర కాలంగా టైటిల్‌ వేట..పేరు మార్చుకున్న ఫలితం దక్కలేదా ?

పుష్కర కాలంగా టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈసారి కూడా ఓటమి తప్పలేదు. తొలిసారి ఫైనల్‌కు చేరిన ఈ జట్టు.. రోహిత్‌ సేన చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆఖరిపోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసింది..ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్‌ సొంతం చేసుకోలేదు. పేరు మార్చుకొని బరిలోకి దిగినా ఆ జట్టుకు కలిసి రాలేదు.

గత సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్ వరకు వెళ్లినా.. క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. అయితే ఈ సారి లెక్క మారింది. కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ కొత్తగా, చాలా బలంగా కనిపించింది. గత సీజన్లతో పోలిస్తే ఓ అడుగు ముందే ఉంది. ఆ అంచనాలకు తగ్గుట్టుగానే ఫైనల్‌కు చేరింది. కాని కథ మారలేదు. ఫైనల్‌లో ముంబై చేతిలో ఓడిపోయింది.

ఇతర జట్ల మాదిరిగానే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లోనూ బలమైన పవర్ హిట్టర్లు ఉన్నారు. పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లాంటి భారత ఆటగాళ్లకు తోడు మార్కస్ స్టోయినిస్, హెట్‌మైర్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఢిల్లీ బ్యాటింగ్ డెప్త్ చాలా ఎక్కువగా ఉన్నా ఈ ఏడాది మాత్రం కలిసి రాలేదు. లీగ్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టినా ఫైనల్‌ ఫైట్‌లో మాత్రం తేలిపోయారు.

వీరంతా స్థాయికి తగ్గట్టు ఆడితే ఢిల్లీ సులువుగా 200కిపైగా స్కోర్లు సాధించేది. కాని ముంబై బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయారు. బౌలింగ్ విషయంలోనూ ఢిల్లీ అంతే బలంగా కనిపిస్తుంది. కగిసో రబడా, అశ్విన్ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లున్నారు. అయినా వారు వికెట్లు రాబట్టలేకపోయారు. అక్షర్ పటేల్ కొన్ని మ్యాచుల్లో హిట్టింగ్‌ చేసి జట్టుకు విజయాలందించినా.. ఆఖరిపోరులో మాత్రం పరుగులు రాబట్టలేకపోయాడు.

2008లో ప్రారంభించిన ఈ జట్టుకు మొదట ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ అని పేరు పెట్టారు. పదేళ్లపాటు ఆడినా కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. దీంతో పేరు అచ్చురాలేదని డిసైడ్‌ అయ్యారు ప్రాంఛేజీ ఓనర్లు. పేరు మార్చితే కలిసొస్తుందని ఆశించారు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా ఛేంజ్‌ చేసినా ఫలితం లేకుండాపోయింది. గత రెండు సీజన్‌లలోనూ టైటిల్‌ రేసులో నిలవలేదు.

ఇక ఈ ఏడాది ఆశించన స్థాయిలో జట్టు ఆట కనబరించింది. 14 లీగ్‌ మ్యాచుల్లో 8విజయాలు సాధించి పాయింట్స్‌ టేబుల్‌లో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. క్వాలిఫయర్‌-1లో ముంబై చేతిలో ఓడిపోయింది. అయితే ఫైనల్‌ రేసులో నిలవాలనే పట్టుదలతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. తిరిగి ముంబై చేతిలో మరోసారి ఓడి రన్నరప్‌గా నిలిచింది.