దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ కాస్త ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే. అయితే, ముంబయిలో ప్రవేశించిన కొన్నిరోజులకే రుతుపవనాల ప్రభావం మొదలైంది. భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అంధేరీ సబ్ వే నీట మునిగింది. గోరేగావ్, విలేపార్లే, లోయర్ పారెల్ ప్రాంతాల్లోనూ వర్షబీభత్సం కనిపించింది. థానేలో రహదారులు జలమయం అయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. బోరివెలి వెస్ట్, ఎస్వీ రోడ్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది.
బోరివెలి వెస్ట్, ఎస్వీ రోడ్ ప్రాంతాల్లోఈదురుగాలుల కారణంగా గత 24 గంటల వ్యవధిలో 26 చోట్ల చెట్లు కూలిపోయాయి. ముంబైలోని మలాడ్‌లో చెట్టు కూలిన ఘటనలో కౌశల్ దోషి అనే వ్యక్తి మరణించాడు. రాష్ట్రంలో వర్షాలు మరో అయిదు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రోడ్లపైకి నీరు చేరింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్లొద్దని ప్రజలకు సూచించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వర్షాలకు ముంబైలోని అండర్ పాస్‌లన్నీ వరదనీటితో నిండిపోయాయి. వరద ముంచెత్తడంతో అంధేరీ సబ్‌వేలో రెండు అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి. దీంతో బీఎంసీ అధికారులు దీన్ని మూసివేశారు. సబర్బన్ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.