ఫిష్ ఆంధ్రా కాస్త ఫినిష్ ఆంధ్రగా మారింది : లోకేశ్‌

-

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గజమాలలు, పూల వర్షం, డప్పులు, టపాసుల మోతలు, యువత కేరింతలతో ముందుకు సాగుతోంది. అన్నమేడు గ్రామంలో రైతులు, స్థానిక మహిళలతోపాటు విద్యార్థినిలు తమ సమస్యలను లోకేష్‌కు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘‘లోకేష్ గారిని చాలా అడిగాం.. ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లాం.. అన్నింటికి వారు పరిష్కారం చేస్తారని అనుకుంటున్నాం.. జగన్ వస్తే ఏదో చేస్తారని అనుకున్నామం.. కానీ ఏం చేయలేదు.. అమ్మ ఒడి పడుతుందని వాలంటీర్లు చెబుతారు.. కానీ పడడంలేదు.. తామే సచివాలయంకు వెళ్లి అమ్మఒడి కావాలని అడుక్కోవాలాంట..’’ మరి వాలంటీర్లు ఎందుకని విద్యార్థినులు ప్రశ్నించారు.

ఓ ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్ మూతపడి ఉన్న దృశ్యాన్ని లోకేశ్ గమనించారు. ఆ ఫిష్ ఆంధ్రా దుకాణం వద్ద ఓ సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ పై విమర్శనాస్త్రం సంధించారు. “ఇది గూడూరు నియోజకవర్గం కోట పట్టణంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసి ఫిష్ ఆంధ్ర చేపల దుకాణం. చిత్తశుద్ది, అవగాహన లేమి కారణంగా ప్రారంభించిన కొద్దిరోజులకే ఫిష్ ఆంధ్రా కాస్త ఫినిష్ ఆంధ్రగా మారి, పులివెందులతో సహా రాష్ట్రంలోని అన్ని దుకాణాలు మూతబడ్డాయి. కియా, ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలతో విజనరీ చంద్రబాబు రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలిస్తే… చేపలు, మాంసం దుకాణాల పేరుతో జగన్ యువత భవితను అంధకారమయం చేశారు. విజనరీ పాలనకు, విధ్వంసకర్త వికృత చర్యలకు తేడా ఇదే తమ్ముళ్లూ..!” అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news