దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ భారీగా పెరిగిపోతోంది. పలు రాష్ట్రాల్లో గత వారం రోజుల్లోనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఇక మహారాష్ట్రలో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అయితే త్వరలో ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ముంబైలో నిర్వహించే మ్యాచ్‌లను హైదరాబాద్‌కు మార్చుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ దీన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ప్రతినిధి ఒకరు కొట్టి పారేశారు.
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లు యథావిధిగా జరుగుతాయన్నారు. ముంబైలోని వాంఖెడె స్టేడియంకు చెందిన 10 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు నమోదైనా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందువల్ల స్టేడియం నుంచి మ్యాచ్‌లను తరలించేది లేదని, యథావిధిగానే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తామని తెలిపారు.
కాగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే పలు జట్లలో కొందరు సభ్యులు ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డారు. ఇది బీసీసీఐని ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ముంబైలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో అక్కడి ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా ఇతర నగరాలకు తరలిస్తారని భావించారు. కానీ దీనిపై సదరు అధికారి స్పష్టమైన ప్రకటన చేశారు. అయినప్పటికీ ముందు ముందు ఏం జరుగుతున్నది ఆసక్తికరంగా మారింది.