మున్సిపల్‌ టీచర్లకు శుభవార్త.. బదిలీలకు షెడ్యూల్‌

-

ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌ టీచర్లకు శుభవార్త చెప్పింది. జగన్‌ సర్కార్‌ అన్ని శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలపడంతో తాజాగా పురపాలకశాఖలోని ఉపాధ్యాయులకు బదిలీల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ అండ్‌ డైరక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తూ ప్రాంతీయ సంచాలకులకు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత బదిలీల్లో ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో బదిలీలు నిర్వహించనున్నారు. రెండేళ్లు సర్వీసు కనీస అర్హతగా ఈ బదిలీల మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అక్టోబరు 1, 2021 తేదీని పరిగణనలోకి తీసుకుని సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయులకు, స్కూల్‌ అసిస్టెంట్లకు 8 విద్యా సంవత్సరాలు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు 5 విద్యా సంవత్సరాల పాఠశాల సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీ తప్పనిసరి చేయనున్నట్లు ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు.

Kolkata Municipal Corporation to recruit School Teachers for Education  Department

50 సంవత్సరాలు నిండిన పురుష ప్రధానోపాధ్యాయులు, మహిళా ప్రధానోపాధ్యాయులను బాలికల ఉన్నత పాఠశాలల్లో నియమించనున్నట్లు, ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఒక ఏడాది సర్వీస్‌ కాలానికి 0.5 చొప్పున గరిష్టంగా 15 పాయింట్లు, ఒకే పాఠశాలలో పనిచేసిన కాలానికి సంవత్సరానికి ఒక పాయింట్‌ చొప్పున గరిష్టంగా 8 పాయింట్లు కేటాయించనున్నట్లు ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అవసరానికంటే ఎక్కువ ఉన్న టీచర్లను అవసరమైన పాఠశాలకు బదిలీ చేయనున్నారు. ఈ నెల 9 నుంచి ప్రక్రియ ప్రారంభించి 17కు పూర్తి చేయాలని కమిషనర్‌ ఆదేశించారు.

ఈ నెల 9, 10 తేదీల్లో ఖాళీలను ఖరారుచేసి జాబితాను ప్రకటించాలని, ఈ నెల 11 నుంచి 12వ తేదీ వరకు సీనియారిటీ జాబితా ప్రకటించాలని పేర్కొన్నారు. 13, 14 తేదీల్లో టీచర్లు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించి, హార్డ్‌ కాపీలను ఆయా మున్సిపల్‌ కమిషనర్లకు అందజేయాలని సూచించారు. టీచర్ల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆర్‌డీఎంఏలకు అందజేయాలని ఆదేశించారు. 15వ తేదీన ఆర్‌డీఎంఏలు దరఖాస్తులను పరిశీలించి 16, 17 తేదీల్లో కౌన్సిలింగ్‌ నిర్వహించి బదిలీల ఉత్తర్వులు ఇవ్వాలని షెడ్యూల్లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news