అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న విషయం విదితమే. అందులో భాగంగా ప్రధాని మోదీ పూజ చేస్తారు. అందుకు గాను ఇప్పటికే 5 వెండి ఇటుకలను సిద్ధం చేశారు. 5 గ్రహాలను ప్రతిబింబించే ఆ 5 వెండి ఇటుకల్లో మోదీ ముందుగా ఒక ఇటుకతో భూమి పూజ చేస్తారు. కాగా ఆ కార్యక్రమానికి హాజరు కావడం కోసం ఓ ముస్లిం వ్యక్తి ఏకంగా 800 కిలోమీటర్ల ప్రయాణం మొదలు పెట్టాడు.
చత్తీస్‌గడ్‌కు చెందిన మహమ్మద్ ఫయీజ్ ఖాన్ అనే వ్యక్తి అయోధ్యలో జరిగే రామ మందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొనేందుకు బయల్దేరాడు. అందులో భాగంగా అతను ప్రస్తుతం మధ్యప్రదేశ్‌కు చేరుకున్నాడు. కార్యక్రమం జరిగే తేదీ వరకు అతను అయోధ్యకు చేరుకుంటాడు. ఈ క్రమంలో అతను మొత్తం 800 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయనున్నాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను ముస్లిం వ్యక్తినే అయినా తన పూర్వీకులు మాత్రం హిందువులే అయి ఉంటారని అన్నాడు.
తమ పూర్వీకుల పేర్లు రామ్‌లాల్, శ్యాంలాల్ అయి ఉంటాయని ఫయీజ్ ఖాన్ అన్నాడు. చర్చి లేదా మసీదు దేనికి వెళ్లినా మనందరి మూలాలు హిందూ మతంలోనే ఉంటాయన్నాడు. తాను ముస్లిం అయినా శ్రీరాముడికి భక్తున్నని అందుకనే అయోధ్యలో జరిగే భూమి పూజకు బయల్దేరానని తెలిపాడు. ప్రముఖ పాకిస్థాన్ కవి అల్లామా ఇక్బాల్ నుంచి తాను ప్రేరణ పొందానని అన్నాడు. అతను చెప్పినట్లు శ్రీరాముడు భారతదేశానికంతటికీ దేవుడని అన్నాడు.
కాగా భూమి పూజ కార్యక్రమం మొత్తం 3 రోజుల పాటు జరగనుంది. అందులో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే సమయంలో మోదీ భూమి పూజలో పాల్గొంటారు.