బీజేపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్.. నిరూపిస్తే మోకాళ్ళపై కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన !

జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి గట్టి సవాల్ విసిరారు. జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్లో ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మినీ డైరీ రైతుల అవగాహన ,శిక్షణ కార్యక్రమనికి ముఖ్యఅతిధిగా హాజరయ్యి అర్హులైన లబ్ధిదారులకు రుణ పత్రాలు అందచేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఏటా రూ.2లక్షల75 వేల కోట్లు చెల్లిస్తున్నామని, కేంద్రం మాత్రం తిరిగి రూ.లక్షా నలభై ఐదు వేల కోట్లు మాత్రమే ఇస్తుందని మరో లక్ష 30 వేల కోట్లు రాష్ట్రానికి ఇవ్వకుండా కేంద్రం దగా చేస్తుందని ఆరోపించారు. తన ఆరోపణలు తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే జనగామ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల అంబేద్కర్ విగ్రహాల వద్ద మోకాళ్ళ పై కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే సవాల్ స్వీకరించాలి అని ఆయన అన్నారు.