మటన్ తింటున్నారా తస్మాత్ జాగ్రత్త.. 400 కిలోల కుళ్ళిన మాంసం సీజ్ !

విజయవాడలో మటన్ మాఫియా ఆగడాలు రోజురోజుకీ రెచ్చిపోతున్నాయి. విజయవాడలో యదేచ్ఛగా కుళ్ళిన, పురుగులు పట్టిన మాంసాన్ని వినియోగదారులకు అమ్మేస్తున్నారు దుకాణదారులు. మొన్న విజయవాడలోని బార్బీ క్యూ రెస్టారెంట్ లో కుళ్ళిన మాంసం దొరకడంతో అధికారులు ఈ మాంసం దుకాణాల మీద కూడా దృష్టి పెట్టారు. ఈ రోజు వన్ టౌన్ గొల్లపాలెంగట్టు ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు కొన్ని దుకాణాల మీద దాడులు చేయగా అక్కడ కుళ్ళిన మాంసం అమ్ముతున్నట్లు గుర్తించారు.

విజయవాడ వ్యాప్తంగా ఏకంగా 400 కిలోల కుళ్ళిన, పురుగులు పట్టిన మటన్ ని సీజ్ చేశారు అధికారులు. ఈ మటన్ గుంటూరు సంత నుంచి తెచ్చి విక్రయిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇక హోటల్స్ కూడా ఈ పాడయిన మటన్ ని వాడుతున్నారని మున్సిపల్ అధికారులు గుర్తించారు. అంతే కాక బీఫ్ ను కూడా కలిపి ఈ మాంసంతో పాటు సరఫరా చేస్తున్నారని మున్సిపల్ అధికారులు గుర్తించారు. అలానే విజయవాడ వ్యాప్తంగా ఉన్న హోటల్స్ ని తనిఖీ చేయడానికి మా దగ్గర తగినంత ఫుడ్ సేఫ్టీ అధికారులు లేరని చెబుతున్నారు. ఈ కుళ్ళిన మాంసం అమ్ముతున్న దుకాణదారులు మీద కేసులు నమోదు చేసే ప్రక్రియ కూడా ప్రారంభించారు మున్సిపల్ అధికారులు.