ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మన బడి నాడు నేడు’ పథకానికి నాబార్డ్ రూ. 1,137 కోట్ల మేర రుణం మంజూరు చేసినట్లు ఆ బ్యాంకు రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ జన్నావార్ తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మన బడి నాడు నేడు’ పథకం కింద అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు 2023 సంవత్సరం నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులను ఆర్ ఐడీఎఫ్ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న గ్రామీణ విద్యా, వైద్య సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం వినియోగించనుందని చెప్పారు.
ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 11,800 ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాల కల్పనకై పాఠశాల విద్యాశాఖకు రూ. 781.13 కోట్ల రుణం లభిస్తుందని వివరించారు. సుమారు17 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల లబ్ది పొందుతారన్నారు. తాగునీటిని యూవీ శుద్ధీకరణ చేసే యూనిట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రక్షిత మంచినీరు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.