బాలుడి ప్రాణం తీసిన నాలా.. హైదరాబాద్‌లో విషాదం

హైదరాబాద్: బోయిన్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. చిన్న తోకట నాలాలో పడిన 8 ఏళ్ల బాలుడు ఆనంద్ సాయి మృతి చెందారు. ఆడుకుంటూ వెళ్లి నిర్మాణం‌లో ఉన్న నాలాలో బాలుడు పడిపోయాడు. నాలాలో గాలించి బాలుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు. నిర్మాణం చేస్తున్న నాలాకు ఎలాంటి పైకప్పు లేక పోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడూ కళ్లముందే కనిపించే బాలుడు.. ఇక లేకపోవడంతో స్థానికులు కంటతడి పెట్టారు. గత ఘటనల దృష్ట్యా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. తమ కుమారుడు నాలాలో పడిన వెంటనే మున్సిపల్ అధికారులు, పోలీసులకు ఫోన్ చేశామని.. వాళ్లు సకాలంలో స్పందించలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ప్రయత్నిస్తే తమ బాలుడు క్షేమంగా బయటకు వచ్చేవాడని అంటున్నారు. నాలా నిర్మాణంలో ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.