రూ.100 కోట్లు ఇచ్చాం.. రెడీగా ఉన్నాం: హ‌రీశ్ రావు

హ‌రీష్‌ రావు | Harish Rao

సిద్దిపేట: వ్యాక్సినేషన్ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హ‌రీశ్ రావు కీలక విషయాలను వెల్లడించారు. కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చిందని, మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ రాష్ట్రాలను బద్నాం చేస్తుందన్నారు. వ్యాక్సినేషన్ సకాలంలో పంపిణీలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై పునసమీక్షించుకోవాలని కోరారు. వ్యాక్సి నేషన్ దిగుమతిని సరళతరం చేయాలని సూచించారు.

వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హ‌రీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్ లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదు. కంపెనీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని వ్వడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ను కూడా కంపెనీల నుంచి కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని మంత్రి హ‌రీష్‌ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట బాలాజీ గార్డెన్‌లో 11రకాల స్పైడర్లకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి హ‌రీశ్ రావు ప్రారంభించారు.