హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ నేడు వైసీపీ కార్యకర్తలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బాలకృష్ణను హిందూపురం పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బాలయ్య మాట్లాడుతూ.. “నా మౌనం చేతగాని తనం అనుకోవద్దు.. నేను నిన్న సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది..? కాని చట్టంపై మాకు గౌరవం ఉంది’ అని చెప్పుకొచ్చారు. కక్షసాధింపు చర్యలను మానేసి.. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా అభివృద్ధి చేయాలి.. ఆదాయం సమకూర్చుకునే విధానాలు ఏంటి అన్న దానిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదని సలహా ఇచ్చారు.
శాసనమండలి రద్దును ప్రస్తావిస్తూ కూడా సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘ఆ రోజు తండ్రి మండలిని పునరుద్దిస్తే.. ఇప్పుడు తనయుడు రద్దు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కాగా.. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రదర్శనలు చేస్తుండగా.. ఈ ప్రతిపాదనను టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూపూర్ వచ్చిన బాలకృష్ణను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. బాలకృష్ణతో పాటు చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ నేపథ్యంలో హిందూపూర్‌లోని రహమతపురం సర్కిల్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.