ఏపీ ప్రదాన ప్రతిపక్షం టీడీపీలో సంచలనం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోందా ? ఇప్పుడున్న పరిస్థితి నుంచి పార్టీని ఒడ్డున పడేసేందుకు, వచ్చే 2024 ఎన్నికల నాటికి పూర్తిగా పార్టీలో ధైర్య.. శౌర్యాలను నింపేందుకు పార్టీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. ప్రస్తుతం పార్టీకి కీలకమైన దశ నడుస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలుఉన్నాయి. అదే సమయంలో మరో పక్క అధికార పార్టీ వైసీపీని తట్టుకునే నాయకత్వం కావాలి. దీంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన తన కోడలు, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటున్న బ్రాహ్మణి.. ఇప్పు డు టీడీపీలోకి రావడం వల్ల పార్టీకి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. నందమూరి బాలకృష్ణ కుమార్తె కావడం కూడా బ్రాహ్మణికి ప్లస్ అవుతోంది. అదే సమయంలో ఆమెకు వాక్చాతుర్యం ఉందని, రెండు నుంచి నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడతారని అంటున్నారు. మొత్తానికి నారా బ్రాహ్మణి ఎంట్రీతో పార్టీ పరిస్థితిని యూటర్న్ తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్‌లో యువ నాయకులతో లోకేష్ భేటీ అయ్యారు.
వాస్తవానికి ఇది టీడీపీలో యువనేతల భేటీ అని పేరు పెట్టారు. యువనేతలను వారి జీవిత భాగస్వాములతో కలిపి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణి కూడా మెరిసారు. పైకి విందు అని చెప్పినా.. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబు ఈ నాయకులతో భేటీ అయి, భావి కార్యాచరణపై చర్చించారు. ప్రతి ఒక్కరినీ బ్రాహ్మణికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితోనూ ఆమె ఇంటరాక్ట్ అయ్యేలా వ్యవహరించారు. ఈ పరిణామాలను చూసిన తర్వాత.. తర్వలోనే బ్రాహ్మణి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
నిజానికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నే బ్రాహ్మణి విజయవాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత ఈ ప్రచారానికి తెరపడిందనుకోండి. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం.. ఎలా ఎప్పుడు కార్యరూపంలోకి వస్తుందో చూడాలి. ఏదేమైనా వచ్చే ఒకటి రెండు యేళ్లలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం… వచ్చే ఎన్నికల్లో కూడా బ్రాహ్మణి ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టే..?