ఆవు చేలో మేస్తే.. దూగ గట్టున మేస్తుందా? అనేది సామెత. లాజిక్కులు వదిలేసిన గ్రాఫిక్కులు.. పట్టుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు.. సింపతీని నమ్ముకుని.. సిత్రాలు చూపించిన బాబుకు.. అందరూ అలాంటి బ్యాచే తగులుతారనడంలో సందేహం ఏమైనా ఉంటుందా? ఇంద్రుడు, చంద్రుడు.. అంటూ.. లేని పెద్దరికాన్ని లోకేష్‌కు కట్టబెట్టి.. మంత్రిని చేసే వరకు నిద్రపోని నాయకులు.. తీరా మంత్రిగా ఆయన వెలగబెట్టిన ఘనకార్యంతో పార్టీ ముక్కలు చెక్కలయ్యే పరిస్థితి వచ్చిన విషయాన్ని మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు దేవాన్ష్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
చంద్రబాబు కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రంలోకి అడుగు పెట్టడం లేదు. అలాగని రాజకీయంగా జగన్ సర్కారుపై విమర్శలు కూడా మరిచిపోవడం లేదు. జూమ్ యాప్‌లోనో.. మరోదానిలోనో ఆయన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా కూడా అలాంటి కార్యక్రమమే ఇంటి నుంచి చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన మనవడు దేవాన్ష్ సడన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాతయ్య ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న బుడ్డోడు కెమెరా కంటపడకుండా తిన్నగా కింద పాకుతూ పక్కకు జరిగాడు. చంద్రబాబు వెనుకవైపు సెల్ఫ్‌లో బుక్ తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు
జరిగింది ఇదైతే.. దీనికి టీడీపీలోని సోషల్ మీడియా బాజాభజంత్రీలు మోగించింది. `నిజంగా లోకేష్ కుమారుడు ఈ వయస్సులో ఇంత క్రమశిక్షణతో మెలుగుతున్నాడంటే నిజంగా గ్రేటే` అని కొందరు బుగ్గలు నొక్కుకుంటే.. `ఈ వయసుకే ఇంత పరిపక్వత అంటే మామూలు విషయం కాదు` అని మరికొందరు బుల్లిదొరకు.. రెడ్ కార్పెట్ పరిచేలా వ్యాఖ్యలు చేశారు. అంటే.. దీనిని బట్టి ఇంత పరిపక్వత ఉన్న దేవాన్ష్‌ను చూసి చంద్రబాబుకు తన తదుపరి ఎవరుపగ్గాలు చేపడతారా? అన్న దిగులు పోయిందనే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.
తాత మనసెరిగి, పరిపక్వత కలిగిన పురుషుడిగా.. ఎదిగాడన్నమాట.. ఏం సెప్పారండీ.. తమ్ముళ్లు!! ఇలాంటివే కదా.. బాబుకు సైతం కావాలి!!