సీఎం జగన్ కు నారా లోకేష్ మ‌రో బ‌హిరంగ లేఖ‌

సీఎం జగన్ కు నారా లోకేష్ మ‌రో బ‌హిరంగ లేఖ రాశారు. బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అహంకార ధోరణేన‌ని… ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని నిప్పులు చెరిగారు. వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యం, ధాన్యం బకాయిలు, పంట నష్ట పరిహారం రాకపోవడం, రైతుకి ఉపయోగం లేని ఆర్బీకే సెంటర్ల కారణంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో చెరకు రైతులు నష్టాల్లో కూరుకుపోయారని… విజయనగరంలోని ఎన్‌సిఎస్‌ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రెండు వేల మంది చెరకు రైతులకు రెండు సీజన్ల బకాయి బిల్లులు రూ.17 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందన్నారు.

బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో చక్కెర కర్మాగారం వద్ద రైతులు ఆందోళన చేపట్టారని.. అసమర్ధ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ గళమెత్తిన రైతుల పై ఉక్కుపాదం మోపుతున్నారు. రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని నిల‌దీశారు. ఇప్పుడు రైతులను మరింత మానసిక క్షోభకి గురిచేస్తూ బొబ్బిలి, సీతానగరం మండలాల్లో 80 మంది రైతులకు నోటీసులు అందజేశారని.. కష్టపడి పండించిన చెరకును చక్కెర పరిశ్రమకు తరలిస్తే రైతులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోకుండా బిల్లుల కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం అన్యాయమ‌న్నారు.

. తీవ్ర సంక్షోభంలో ఉన్న చెరకు రైతులను ఆదుకోవడం మాని ప్రభుత్వమే వారిపై వేధింపులకు దిగడం ప్రభుత్వ అహంకార ధోరణికి పరాకాష్ట అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నారా లోకేష్‌. రైతులకు నోటీసులు పంపి ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తేసి బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నానని తెలిపారు.