వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడినట్టుగా భావిస్తున్న వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ వెల్లడించడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందినదిగా వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప చేసిన ప్రకటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఫకీరప్ప మీడియా సమావేశం ముగిసిన వెంటనే మంగళగిరిలో మీడియా ముందుకు వచ్చిన లోకేష్ పలు అంశాలపై ఎస్పీకి ప్రశ్నలు సంధించారు.
ఎంపీ మాధవ్‌కు చెందినదిగా భావిస్తున్న ఆ వీడియో ఫేక్ అని ఎలా తేల్చారో ఎస్పీ ఫకీరప్ప చెప్పాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. అంతేకాకుండా ఈ వీడియోకు సంబంధించి ఒరిజినల్ వీడియో అంటూ ఒకటి ఉందని ఎస్పీ భావిస్తున్నారా? అని కూడా ప్రశ్నించారు నారా లోకేష్. అయినా ఆ వీడియో ఒరిజినల్ కాదంటూ ఏ ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందో ఎస్పీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.