శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో.. కృష్ణమ్మ ఉరకలేస్తూ.. శ్రీశైలాన్ని చేరింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహ పెరగడంతో.. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇక కృష్ణమ్మ పాల పొంగులా నురగలు కక్కుతూ.. నాగార్జున సాగర్ వైపు పరుగులు పెట్టింది. శ్రీశైలంలో గేట్లు ఎత్తివేయడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 210 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,02,932 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,77,080 క్యూసెక్కులుగా ఉంది.
ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణతో పాటు ఏపీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో.. మత్య్సకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అంతేకాకుండా తెలంగాణలో మరో 7 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించిన ఐఎండీ.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.