ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ తన ఎస్సీలు అంటూనే రోజుకో ఎస్సీని చంపేస్తున్నారని ఆరోపించారు. దళిత హోంమంత్రి ఇలాకాలో పోలీసుల వేధింపులతో దళిత యువకుడు మహేందర్ బలవన్మరణం చెందాడని లోకేశ్ విమర్శించారు.ఎస్సీలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
జగన్ పాలన అంతా విధ్వంసమేనని విమర్శలు చేశారు.ఈ క్రమంలో ఈసారి వైసీపీ అధికారంలోకి రాదని, తమ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీలపై దాడులు అరికట్టాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంటే.. ఇంకో డాక్టర్ సుధాకర్, ఇంకో ఓంప్రతాప్, మరో చీరాల కిరణ్‌కుమార్‌లాగే దళితులు బలవుతూనే ఉంటారని అన్నారు.
పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం అయిన పులివెందుల వెళ్లాల్సి వచ్చినా సీఎం జగన్ భయంతో వణికిపోతున్నారని అన్నారు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జనాన్ని చూడాలంటే జగన్ రెడ్డికి భయమని ఎద్దేవా చేశారు.సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద వైఎస్ జగన్ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రత్యర్థి, టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవిని చూసినా భయపడుతున్నాడరని అందువల్లే ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.