అనంత టీడీపీ నేతలకు లోకేష్‌ క్లాస్‌ పీకింది అందుకే…!

-

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న లోకేష్‌.. నేతలను పిలిచి వార్నింగ్‌ ఇచ్చారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పర్యటన పూర్తయ్యే వరకూ పార్టీ విషయాలపై స్పందించబోనని చెప్పిన లోకేష్‌.. బస్సెక్కిన తర్వాత జిల్లా నేతలను లోపలికి పిలిచి క్లాస్‌ తీసుకున్నారట.

బస్‌లో ఏం జరిగిందన్నది అధికారికంగా తెలియకపోయినా.. పార్టీ వర్గాల్లో మాత్రం ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో అయినా పార్టీలో అయినా సింగిల్‌ లీడర్‌షిప్‌ ఉండాలని.. మరో అధిపత్య కేంద్రానికి తావులేదని లోకేష్‌ స్పష్టం చేశారట. అంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడిచినట్టుగానే నియోజకవర్గంలో ఒక నేతే ఉండాలని అన్నారట. ముఖ్యంగా కల్యాణదుర్గం, శింగనమలలో టీడీపీ నాయకుల మధ్య తరచూ తలెత్తుతున్న సమస్యలపై సీరియస్‌గానే స్పందించారట చినబాబు. శింగనమలలో బండారు శ్రావణి, ఎంఎస్‌ రాజు వర్గాల మధ్య అస్సలు పడటం లేదు. పైకి కలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నా ఎవరి కుంపటి వారిదే అన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

కదిరి, పెనుకొండల్లోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు టీడీపీ నేతలు ఉంటున్నారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్‌, చాంద్‌బాషాలకు అస్సలు పొసగడం లేదు. కల్యాణదుర్గంలో హనుమంతచౌదరి, ఉమామహేశ్వరరావు మధ్య నిత్యం సెగలే. ఎన్నికల సమయంలోనే జిల్లా నేతలను పిలిపించి చంద్రబాబు మాట్లాడినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు చినబాబు ఎంట్రీ ఇచ్చారు. పార్టీ నేతల అంతర్గత గొడవల కారణంగానే జిల్లాలో టీడీపీ ఓడిపోయిందని లోకేష్‌ నాయకులకు తలంటినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news