సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాశారు. మీరు పదవీప్రమాణ స్వీకారం చేసిన నుంచీ ఒక్కో రంగం సంక్షోభంలో కూరుకుపోవడం, యాధృచ్చికమో, మీ ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదు కానీ లక్షలాది మందిపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఇసుక పాలసీ మార్చి భవననిర్మాణరంగాన్ని, దానికి అనుబంధంగా వున్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేశారు. వందలాది మంది భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకి పవర్‌హాలీడే ప్రకటించేలా చేశారు. విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు అన్నీ పెరిగి మద్దతు ధర తగ్గిపోయిన గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులు పంటలు వేయకుండా క్రాప్‌హాలీడే పాటిస్తున్నారు. అన్నదాతల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుండటం వ్యవసాయరంగం దుస్థితిని తేటతెల్లం చేస్తోందన్నారు. ఒక్కో రంగం కుదేలవుతున్నా మీ ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడింది. విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధర అధికం కావడం, రొయ్యల ధర తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించాలని రైతులు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించకపోవడం విచారకరమన్నారు నారా లోకేష్.
కనీసం 15 రోజులపాటు రొయ్యల రేటు పడిపోకుండా నిలకడగా వుండేలా చూడాలి. పెంచిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెస్ ని తగ్గించాలి ధరలు పడిపోతే ప్రభుత్వం నుంచి మద్దతు అందించాలి. ఈ ప్రోత్సాహాకాలు ప్రభుత్వం నుంచి ఆక్వా రంగానికి అందకపోతే..కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే పరిశ్రమ కూడా హాలీడే తప్పకపోవచ్చు. దయచేసి మీరు ఆక్వారంగం సంక్షోభంలో పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు నారా లోకేష్.