ఢిల్లీ నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేశారు. సరిగ్గా ఒంటిగంటకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఇక మోడీ దేశ ప్రజలనుద్దేశించి 2.15 కు ప్రసంగించనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ప్రాంగణంలో లో నూతన పార్లమెంట్ భవన నిర్మానం జరగనుంది. భూమి పూజా కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ కూడా పాల్గొన్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని, పర్యావరణ హిత విధానాలను పాటిస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ రూపకల్పన చేశారు. ప్రస్తుత పార్లమెంట్ భవన సముదాయంలో ఉన్న లోక్‌సభ, రాజ్యసభల కంటే నూతన భవనంలో ఉభయ సభలు చాలా విశాలమైనవిగా ఉండనున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసమే విస్తీర్ణం భారీగా పెంచారని చెబుతున్నారు.