ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో టీఎస్ ఆర్టీసీ పార్శిల్ – హోమ్ డెలివరీ సేవలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. తొలిదశలో జంట నగరాలలో హోమ్ డెలివరీ సర్వీసు మొదలు పెట్టనున్నారు. వినియోగదారుల ఇంటికి పార్శిల్ ను డెలివరీ చేసే ప్రాతిపదికన ఆర్టీసీ సేవలు అందించనున్నారు. ఇప్పటి దాకా 12.50 లక్షల పార్సిల్స్ డెలివరీ చేశామని 11.50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
ఒక రోజుకు 15 లక్షల ఆదాయం పార్సిల్స్ ద్వారా వస్తోందని, త్వరలో రోజుకు 25 లక్షల ఆదాయంకు చేరుతామని అన్నారు. కూకట్పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్ సెంటర్లు వారీగా విభజించి హోమ్ డెలివరీ చేస్తామని ఆయన అన్నారు. ఆర్టీసీ ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుందని అన్నారు. ప్రయాణికులు ఇప్పుడిప్పుడే ఆర్టీసీ వైపు దృష్టి సారిస్తున్నారని 1500 బస్సులు కొత్తగా సరుకు రవాణా కోసం తయారు చేశామని ఆయన అన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు రావడం లేదని మహారాష్ట్రలో గడిచిన ఐదు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని అన్నారు. ఆర్టీసీలో ఉద్యోగుల పై అధికారుల వేధింపులు లేవని ఆయన అన్నారు. ఉద్యోగ భద్రత పై కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే మంచి కబురు చెబుతామని ఆయన అన్నారు.