ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్‌కోపర్‌లోని సమతా నగర్‌లో సాయంత్రం 4.30 గంటలకు 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ ఈదురు గాలుల తీవ్రతకు పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ముంబయి నగరపాలక సంస్థ అధికారులు ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని తెలిపారు.
మరోవైపు వడాలాలోని బర్కత్ అలీ నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో సాయంత్రం నాలుగు గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలడంతో ఇద్దరు గాయపడ్డారు. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాదర్, కుర్లా, మాహిమ్, ఘాట్‌కోపర్, ములుండ్, విఖ్రోలి, దక్షిణ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి.