వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నేడు మోదీ నామినేషన్‌

-

లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 14వ తేదీ 2024)  వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజునే ఆయన వారణాసికి చేరుకున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై 3 లక్షల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ పై 4 లక్షల 70 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.

సోమవారం రోజున బనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించారు. రోడ్ షోలో మోదీ వెంట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ముఖ్య నేతలున్నారు. రోడ్ షోకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వారందరికీ  ప్రధాని మోదీ, యోగి అభివాదం చేశారు. రోడ్ షోకు ముందు వారణాసిలోని పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news