అతి త్వరలో 18వ లోక్‌సభ కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈసారి ఒక్క శాతం కూడా పేపర్ వాడకం లేకుండా కార్యకలాపాల నిర్వహణకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం ఏర్పాట్లలో నిమగ్నమైంది. కొత్త సభ్యుల నమోదు నుంచి అన్నింటినీ డిజిటల్ పద్దతిలోనే చేపట్టింది.
డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎంపికైన వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పార్లమెంటు ప్రాంగణంలో గైడ్ పోస్టులు పెట్టింది. రైళ్లు, విమానాల ద్వారా వచ్చే కొత్త సభ్యుల కోసం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి పార్లమెంటుకు వెళ్లే ఏర్పాట్లు చేసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులకు తాత్కాలిక విడిది కోసం . వెస్ట్రన్ కోర్టు హాస్టల్, హోటల్ అశోకా, ఎంఎస్ ప్లాట్స్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో 24 గంటలు వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటులో..వివిధ శాఖలకు వెళ్లి సంతకాలు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది.