లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మెజారిటీ సీట్లు సాధించిన విషయం తెలిసిందే. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న నినాదంతో బరిలోకి దిగిన కూటమి ఆ దిశగా లక్ష్యం చేరుకోలేకపోయినా మూడోసారి అధికారం చేపట్టే సీట్లు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సమీక్షించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో కేంద్ర మంత్రివర్గం చర్చించనున్నట్టు సమాచారం.
ఈ సమావేశం అనంతరం మంత్రి మండలి సమావేశం ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రెండో దఫా మోదీ ప్రభుత్వంలో ఏర్పాటైన కేబినేట్, మంత్రి మండలికి ఇదే చివరకి సమావేశం. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగుస్తుంది. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లు సాధించగా ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుంది.