కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఎన్నో రంగాలను తీవ్రమైన నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. అనేక రంగాలు తీవ్రమైన నష్టాలతో విలవిలలాడుతున్నాయి. ఇక ఉత్తరఖాండ్ రాష్ట్రంలో కరోనా వల్ల అక్కడి టూరిజం రంగం దారుణంగా దెబ్బతిన్నది. ఆ రంగంలో అక్కడ 25 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో టూరిజం రంగంపై ఆధారపడి సుమారుగా 20 నుంచి 25 లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారని, వారికి టూరిజమే ప్రధాన ఆదాయ వనరని ఆ రాష్ట్ర టూరిజం వైస్ ప్రెసిడెంట్ విజయ్ తెలిపారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా 25 లక్షల మంది వరకు ఉపాధిని కోల్పోయారని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా వెబ్‌సైట్‌తో మాట్లాడారు.
ప్రస్తుతం డీజిల్‌పై 28 శాతం పన్ను వసూలు చేస్తున్నారని, అయితే డీజిల్‌ను జీఎస్‌టీ కిందకు తెచ్చి 10 శాతం పన్ను విధిస్తే.. టూరిజం రంగంలో ఎంతో మందికి హెల్ప్ అవుతుందని విజయ్ అభిప్రాయపడ్డారు. ఇక టూరిజం రంగం ఇప్పుడప్పుడే మళ్లీ గాడిలో పడే పరిస్థితి ప్రస్తుతం లేనందున ఆ రంగంపై ఆధార పడ్డ వారి కోసం కేంద్రం ప్యాకేజీని ప్రకటిస్తే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.