వర్షాలు కురుస్తున్నప్పుడు మెరుపులు రావడం, పిడుగులు పడటం సహజం. పిడుగు శబ్ధం వినగానే మనలో ఒక్కసారిగా భయం ఆవహిస్తుంది. అది ఎక్కడో పడినా.. మన సమీపంలోనే పడినట్లు అనిపిస్తుంది. అలా వర్షాలు కురుస్తున్న సమయంలో ఒకరోజులో ఓ పదిసార్లు పిడుగులు పడటం సర్వసాధారణం. కానీ ఓ చోట మాత్రం అరగంట వ్యవధిలో ఐదు వేలకు పైగా పిడుగులు పడ్డాయి. నిజమండీ బాబూ.. ఇంతకీ అదెక్కడంటే..?
ఒడిశాలోని భద్రక్ జిల్లా బాసుదేవపూర్లో బుధవారం సాయంత్రం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి. ఈ పిడుగుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏం సంభవించలేదు. కానీ పిడుగుపాటు శబ్దాలకు బాసుదేవపూర్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనపుడు ఇలా జరుగుతుందని గోపాల్పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ ‘చెప్పారు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయని తెలిపారు. ప్రతి పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక సాంకేతికత రాడార్ కేంద్రానికి ఉందని చెప్పారు.