ఛత్తీస్గఢ్లోని బెమెతర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెమెతర జిల్లాలోని తిరయ్య గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లిన బాధితులు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కును కథియా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన డ్రైవర్ ఆపారు. ఇంతలో ఆ మార్గంలో ఓ సరుకు వాహనం వచ్చి మినీ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనతో ట్రక్కులో ఉన్న వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 23 మంది గాయపడ్డారు. మృతులను పాతర్రా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.