ముంబయి సెషన్స్ కోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. జైల్లో దోమల బెదడ తీవ్రంగా ఉందని చెప్పేందుకు ఓ దోషి వెరైటీ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓ బాటిల్లో చనిపోయిన దోమలతో కోర్టుకు వెళ్లాడు. ఆ బాటిల్‌ను కోర్టుకు చూపించి దోమల బారి నుంచి రక్షించుకునేందుకు తనకు దోమ తెరను ఏర్పాటు చేయాల్సింది కోరాడు.
పలు కేసుల్లో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మాజీ అనుచరుడు కూడా. అయితే, తలోజా జైల్లో దోమల బెడద తీవ్రంగా ఉందని తన గదిలో దోమ తెర ఏర్పాటు చేయాల్సిందిగా సెషన్స్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేశాడు.
ఈ పిటిషన్‌కు సంబంధించి గురువారం విచారణ జరగ్గా ఎజాజ్ హాజరయ్యాడు.వాదనలు విన్న అనంతరం ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దోమల బారి నుంచి కాపాడుకునేందుకు దోమ తెరలే వినియోగించాల్సిన అవసరం లేదని, ప్రత్యామ్నాయంగా ఓడొమోస్ లేదా దోమలను అరికట్టే ఇతర సాధనాలను వినియోగించాలని స్పష్టం చేసింది.