అలహాబాద్ యూనివర్సిటీకి చెందిన వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సంగీత శ్రీవాత్సవ రాసిన లెటర్ సంచలనం సృష్టిస్తోంది. తమ ఇంటి సమీపంలో ఉన్న ఓ మసీదులో నిత్యం ఉదయాన్నే 5.30 గంటలకు అజాన్ వల్ల తనకు నిద్రా భంగం అవుతుందని ఆమె తెలిపింది. పెద్ద శబ్దంతో మైక్ పెట్టి అజాన్ చేస్తారని, దీంతో తనకు నిద్ర సరిగ్గా ఉండడం లేదని, ఫలితంగా రోజంత తలనొప్పి సమస్యతో బాధపడుతున్నానని ఆమె తెలిపింది.
ఉదయం నిద్ర సరిగ్గా ఉండకపోవడం వల్ల అది తన పనిపై కూడా ప్రభావం చూపిస్తుందని సంగీత శ్రీవాత్సవ తాను కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొంది. అందువల్ల మైక్ లేకుండా అజాన్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె కోరింది. తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని, దయచేసి దీన్ని ఆ దృష్టితో చూడవద్దని కోరింది. ఇక ఆమె 2020లో అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది.
గతంలో ఇదే విషయంపై ఓ పిటిషనర్ పిటిషన్ వేయగా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఏ మతం కూడా పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రార్థనలు చేయమని చెప్పలేదని, అలా చేస్తే ఆ విషయం ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదని, కనుక మైక్‌లు, లౌడ్ స్పీకర్లు లేకుండా ప్రార్థనలు చేసుకోవాలని అప్పట్లో ఆ కోర్టు తెలిపింది. అదే విషయాన్ని సంగీత తన లేఖలో పేర్కొంది. అయితే ఆమె లెటర్ తమకు అందిందని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, కలెక్టర్ భాను చంద్ర గోస్వామిలు తెలిపారు. కాగా ప్రస్తుతం ప్రొఫెసర్ సంగీత శ్రీవాత్సవ రాసిన ఆ లెటర్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే సృష్టిస్తోంది.