ఇలాంటి లింక్‌లతో తస్మాత్ జాగ్రత్త

నేటి డిజిటల్ యుగంలో కంటికి కనిపించని సైబర్ నేరగాళ్ళు సెకన్ల వ్యవధిలో డేటాను చోరీ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పర్సనల్ డేటాతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. అయితే ఇలా జరగడానికి మన అజాగ్రత్తే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైబర్ నేరగాళ్ళు అయితే సోషల్ మీడియా వేదికలే లక్ష్యంగా నెటిజన్లకు వల వేస్తున్నారు.

 

అయితే తాజాగా వాట్సాప్‌లో మరి కొన్ని లింక్‌లు వైరల్ అవుతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితమంటూ ఆ లింక్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటి ఫేక్ లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదంతా పెద్ద మోసమని, అలాంటి లింక్‌లపై అస్సలు క్లిక్‌ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత డేటాను చోరీ చేసేందుకు ఇలాంటి లింక్‌లను పెద్ద ఎత్తున వాట్సాప్‌ల్లో పంపిస్తున్నారని వాటి ద్వారా బ్యాంకింగ్‌ సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుందని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని… స్నేహితులు, కుటుంబ సభ్యులకు లింక్స్ షేర్ చేయకూడదని విజ్ఞప్తి చేసారు. ఇప్పటికే కొన్ని యాంటీ వైరస్‌ ఇంజెన్‌లు ఈ హానికరమైన లింక్‌లను గుర్తించి నిరోధించాయని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి మేసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.