కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఒక సోషల్ మీడియా పోస్ట్ హింసకు దారి తీసింది. తూర్పు బెంగళూరులోని కావల్ బైర్సాండ్రా ప్రాంతంలోని పులకేషినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి బంధువు ఒకరు ఫేస్బుక్ లో అవమానకర పోస్ట్ పెట్టారు అని ఆయన ఇంటి వద్ద వందలాది మంది రాళ్ళు రువ్వారు. అక్కడ నిలిపిన కార్లకు కూడా నిప్పంటించారు.
ఎమ్మెల్యే నివాసానికి కాపలాగా ఉన్న పోలీసు సిబ్బందిపై కూడా రాళ్ళు రువ్వారు. అంతే కాకుండా కొన్ని చోట్ల నిప్పు కూడా అంటించారు. నిరసనకారులు ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలం వద్దకు రావడానికి అనుమతించలేదని పోలీసులు పేర్కొన్నారు. దాడి జరిగినప్పుడు ఎమ్మెల్యే తన నివాసంలో లేరని తెలిసింది. బెంగళూరు పోలీసు కమీషనర్ కమల్ కాంత్ మాట్లాడుతూ… కర్ణాటకలోని బెంగళూరులోని డిజె హల్లి & కెజి హల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో జరిగిన సోషల్ మీడియా పోస్టుపై జరిగిన ఘర్షణల్లో అదనపు పోలీసు కమిషనర్ సహా 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని మీడియాకు తెలిపారు.