భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది డ్రూగ్ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్ రాజు జిగ్మె ఖేసర్ నాంగ్యేల్ వాంగుక్ మోడీకి ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత నరేంద్ర మోడీ కావడం విశేషం. జీవితకాలంలో అత్యుత్తమ విజయాలు, సమాజానికి చేసిన సేవలకు గుర్తుగా ఈ పురస్కారం అందజేస్తారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడమే కాకుండా కొవిడ్ మహమ్మారి సమయంలో 5 లక్షల టీకాలను అందజేయడం లాంటి చర్యలను గుర్తిస్తూ ఈ అవార్డును 2021లోనే ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన భారత ప్రధాని మోడీ, ఈ పురస్కారం అందుకోవడం గౌరవంగా ఉందన్నారు. దీన్ని 140 కోట్ల భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్టు వెల్లడించారు. రెండు రోజుల అధికారిక పర్యటనకు భూటాన్ వెళ్లిన ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం, గురువారమే ఈ పర్యటన జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ఒకరోజు ఆలస్యమైంది. పర్యటన సందర్భంగా భూటాన్ ప్రధాని దాసో షెరింగ్తో ప్రధానీ మోడీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం, పర్యావరణం, వ్యవసాయం వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారం కోసం అవగాహనను కుదుర్చుకున్నారు. 2014లో భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి భూటాన్ లో పర్యటించడం ఇది మూడోసారి.