బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ బైకర్ ఆయనపైకి దూసుకెళ్లేందుకు రాగా.. అప్రమత్తమైన సీఎం వెంటనే ఫుట్‌పాత్ పైకి దూకారు. సీఎం భద్రతలో భారీ వైఫల్యం చోటుచేసుకోవడం ఆ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. నితీశ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో.. కొందరు వ్యక్తులు బైక్‌పై ఆయనకు అత్యంత సమీపానికి వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని ఛేదించుకుని దాదాపు ఆయనను ఢీ కొట్టినంత పనిచేశారు. అప్రమత్తమైన నీతీశ్ వెంటనే ఫుట్‌పాత్‌పైకి దూకారు. గురువారం ఉదయం సీఎం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వెంటనే భద్రతా సిబ్బంది బైకర్లను వెంబడించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనాస్థలంలో సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇది పొరబాటున జరిగిందా లేదా దీని వెనుక ఇంకేదైనా ఉద్దేశం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఎస్ఎస్జీ కమాండెంట్, పట్నా ఎస్ఎస్పీని నీతీశ్ కుమార్ తన ఇంటికి పిలిపించి సమావేశమయ్యారు. ఘటన జరిగిన సర్క్యులర్ రోడ్డులో మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు రాజకీయ నాయకుల నివాసాలున్నాయి.