మహాకూటమి వైపే అనుకూలంగా బిహార్ ఎగ్జిట్ పోల్స్..!

బిహార్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 3 విడతల‌ుగా ఈ ఎన్నికలు జరిగాయి. కాగా వాటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెలువడ్డాయి. బిహార్‌లో మొత్తం 243 స్థానాలకు ఈసీ (ఎలక్షన్ కమిషన్) ఎన్నికలు నిర్వహించింది. కాగా ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. టైమ్స్‌నౌ- సి ఓటర్‌, పీపుల్స్‌ పల్స్, ఏబీపీ న్యూస్‌, రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ వంటి సంస్థలు మహా కూటమికే ఆధిక్యాన్ని కట్టబెట్టాయి.

mahakutami
mahakutami

మహా కూటమికి 120, అధికార ఎన్డీయేకు 116 సీట్లు, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ- సి ఓటర్‌ వెల్లడించింది. ఇక పీపుల్స్‌ పల్స్‌ సైతం మహా కూటమివైపే ఓటర్లు మొగ్గిచూపినట్లు పేర్కొంది. ఆ కూటమికి 100-115 స్థానాలు వస్తాయన్నట్లు అంచనా వేసింది. ఎన్డీయేకు 90-110 స్థానాలు రావొచ్చని తెలిపింది. ఎల్జేపీ 3-5, ఇతరులు 8-18 స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది. ఇక ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేజస్వి యాదవ్‌కు 44 శాతం మంది మద్దతు తెలుపగా.. నితీశ్‌ కుమార్‌కు 35 శాతం మద్దతు లభించింది. చిరాగ్‌ పాస్వాన్‌కు 7 శాతం మంది ఓటేశారు.

ఇతర సర్వేలు సైతం మహా కూటమివైపే మొగ్గు చూపినప్పటికీ.. స్పష్టమైన మెజార్టీ.. ఫలానా పార్టీకి వస్తుందని పేర్కొనకపోవడం గమనార్హం. దీంతో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని మరికొందరు పేర్కొంటున్నారు. అదే జరిగితే ఎల్జేపీ, ఇతరులు కీలకంగా మారే అవకాశం ఉంది. మొత్తం మూడు దశల్లో 243 స్థానాలకు గానూ బిహార్‌లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జేడీయూ, భాజపా ప్రధాన పార్టీలుగా ఉన్న ఎన్డీయే మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు కలిసి ఏర్పడిన మహా కూటమి గట్టి పోటీనిస్తూ బిహార్ పీఠం కైవసం చేసుకోవాలని చూస్తోందని, ఇక చిరాగ్‌ పాస్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. అయితే ప్రజల తుది తీర్పు కోసం మాత్రం ఈనెల 10వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే.

మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం వెలువడ్డాయి. కాంగ్రెస్‌కు 16-18, భాజపాకు 10-12, ఇతరులు 0-2 స్థానాలు వస్తాయని ఆజ్‌తక్‌ సంస్థ సర్వే పేర్కొంది. జ్యోతిరాధిత్య సింథియా తన అనుచరులతో కలిసి భాజపాలో చేరడం వల్ల ఇక్కడి ఉప ఎన్నికలకు కారణమయ్యింది.