కర్ణాటకలో ఇటీవలే రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటనను మరవకముందే తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం రోజున షాహిద్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో మెయిల్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కన్నడ పోలీసు శాఖ అప్రమత్తమైంది.
శనివారం మధ్యాహ్నం 2.48 గంటలకు బెంగళూరులోని రద్దీ ప్రాంతాలతోపాటు రెస్టారెంట్‌లు, దేవాలయాలు, బస్సులు, రైళ్లలో పేలుళ్లు జరుగుతాయని మెయిల్‌లో హెచ్చరించినట్లు తెలిసింది. మరోవైపు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోం మంత్రి, నగర పోలీస్ కమిషనర్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం. బాంబు పేలుళ్లకు పాల్పడకుండా ఉండేందుకు 2.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. బెంగళూరులోని రాజాజీనగర్‌లో ఉన్న రామేశ్వరం కెఫేలో గత శుక్రవారం బాంబుపేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడ్డారు.