ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావ్ ప్రతిపక్ష నాయకులు.. బడా వ్యాపారవేత్తల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చ జరుగుతోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే ఎలాంటి అనుమతి కావాలి..! ఎలాంటి సందర్భాల్లో అధికారులు ఫోన్ ట్యాపింగ్‌ను వినియోగిస్తారు..! ఫోన్ ట్యాపింగ్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఏం చెబుతోంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్ 69తో పాటు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయొచ్చు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశాలతో సత్సంబంధాల నిర్వహణతో పాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, లేదా కేంద్ర ప్రభుత్వం కాల్స్‌ను ఇంటర్సెప్ట్ చేయొచ్చు. ఈ సమాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూటర్‌లో కూడా స్టోర్ చేసుకునేందుకు కూడా అనుమతి ఉంటుంది.
అయితే కాల్స్‌ను రికార్డు చేయడానికి లేదా ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ విషయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. అత్యవసర సమయంలో హోం శాఖలోని జాయింట్ సెక్రటరీ స్థాయి లేదా ఆ పైస్థాయి అధికారి అనుమతితో ఫోన్ కాల్స్ ట్యాప్ చేయొచ్చు. ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసే లేదా ఇంటర్సెప్ట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం పది సంస్థలకు ఇచ్చింది. వీటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ, సీబీడీటీ, డీఆర్ఐ, ఆర్ఏడబ్ల్యూ, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ ఉన్నాయి. రాష్ట్రాల విషయంలో రాష్ట్ర పోలీసు శాఖకు ఫోన్లను ఇంటర్‌సెప్ట్ చేసే అధికారం ఉంటుంది.
మరోవైపు మన ఫోన్‌ను ఎవరైనా ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానం వస్తే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాను అడిగి సమాచారం తెలుసుకోవచ్చు. దీని కోసం సమాచార హక్కు కింద మనం ట్రాయ్‌కు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వెంటనే ట్రాయ్ సంబంధిత టెలికాం ఆపరేటర్ నుంచి సమాచారాన్ని తీసుకుని మనకు పంపిస్తుంది. ట్రాయ్ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఏమైనా తప్పు జరిగినట్లు అనిపిస్తే మనం నేరుగా కోర్టును ఆశ్రయించొచ్చు.