సీబీఐ చేతికి మణిపుర్‌ మహిళలపై లైంగిక దాడుల కేసు

-

జాతుల మధ్య వైరంతో దాదాపు మూడు నెలలుగా మణిపుర్‌ రాష్ట్రం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఓవైపు అల్లర్లతో ఆ రాష్ట్రం అల్లకల్లోమవుతుంటే ఇటీవల అక్కడ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు వెలుగులోకి రావడంతో దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇటీవల మహిళలను నగ్నంగా చేసి ఊరిలో తిప్పిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

కేసు విచారణను కూడా రాష్ట్రం (మణిపుర్‌) బయట చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పొరుగు రాష్ట్రమైన అసోంలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపాయి. మరోవైపు ఈ ఘర్షణలకు కారణమైన మైతేయ్‌, కుకీ వర్గాలతోనూ కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరుపుతోందని.. రాష్ట్రంలో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే ఈ చర్చల ప్రక్రియ తుదిదశలో ఉందని వెల్లడించాయి.

మణిపుర్‌లో దాదాపు మూడు నెలలుగా జరుగుతోన్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మైతేయ్‌, కుకీ వర్గాల ప్రజలతోపాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news